శ్రీకాళహస్తీశ్వర శతకము - ధూర్జటి
విషయ సూచిక :
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ౠ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
అం
అః
క
ఖ
గ
ఘ
ఙ
చ
ఛ
జ
ఝ
ఞ
ట
ఠ
డ
ఢ
ణ
త
థ
ద
ధ
న
ప
ఫ
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
ళ
క్ష
ఱ
అ
(6)
Add New Padyam
"అమ్మా, యయ్య" యటంచునెవ్వరిని నేనన్నన్శివా ! నిన్ను నే
సుమ్మీ నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా
కిమ్మైఁ దల్లియు దండ్రియున్ గురుఁడు నీవేకాన సంసారపుం
జిమ్మంజీకటిఁ గప్పినన్ గడుపు నన్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
అకలంకస్థితి నిల్పి, నాదమను ఘంటారావమున్ బిందు దీ
పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్బూని యానంద తా
రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా
రికిగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
అడుగంబోనిక నన్యమార్గరతులం బ్రాణావనోత్సాహినై
యడుగంబోయినబోదు నీదుపదపద్మారాధక శ్రేణియు
న్నెడకున్ నిన్ను భజింపగా గనియు నాకేలా పరాపేక్ష ? కో
రెడిదింకేమి ? భవత్ప్రసాదమమె తగున్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
అమరస్త్రీలరమించినన్ జెడదు మోహంబింతయున్, బ్రహ్మ ప
ట్టము సిద్ధించిన నాసదీరదు, నిరూఢక్రోధమున్ సర్వలో
కముల న్మ్రింగినమాన, దిందుగల సౌఖ్యంబొల్ల, నీసేవ చే
సి మహాపాతక వారిరాశిఁ గడతున్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
అయవారై చరియింపవచ్చు తన పాదాంభోజ తీర్ధంబులన్
దయతో గొమ్మనవచ్చు సేవకుని నర్థప్రాణదేహాదుల
న్నియు నా సొమ్మనవచ్చు గాని, నరుల న్నిందింప, నిన్నాత్మ ని
ప్క్రియతన్ గానగరాదు పండితులకున్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
అల యేకార్ణవ వేళ నీవు వటపత్రాకారమై యుండఁగా
చెలువంబొప్పఁగ మాధవుండు గలిగెన్ జేరంగఁజోటంచుదా
నెలమిం దామరతంపరై బ్రతికి నాఁడింతాకుపై నుండియే
సిలుగుల్ పొందక నీ కతంబునగదా శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
ఆ
(4)
Add New Padyam
ఆరావంబుదయించెఁ దారకముగా నాత్మాభ్రవీధి న్మహా
కారోకారమకార యుక్తమగు నోంకారాభిధానంబు చె
న్నారు న్విశ్వమనంగఁ దన్మహిమచే నా నాదబిందుల్సుఖ
శ్రీ రంజిల్లఁ గడంగు, నీవదె సుమీ ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఆలంచు న్మెడగట్టి, దానికి సపత్యశ్రేణి కల్పించి, త
ద్బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబుగావించి యా
మాలర్కంబున బాంధవంబనెడి ప్రేమం గొందరం ద్రిప్పగా,
సీలన్సీల నమర్చినట్లొసగితో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఆలుంబిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్ధంబు లీనేర్తురే
వేళ న్వారిభజింప జాలిపడ కావిర్భూత మోదంబునన్
గాలం బెల్ల సుఖంబు నీకు, నిక భక్తశ్రేణి రక్షింప కే
శ్రీ లెవ్వారికిఁ గూడఁబెట్టెదవయా ? శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాభందనం
బేలా నామెడఁ గట్టినాఁడవిఁక నిన్నే వేళఁ జింతింతు, ని
ర్మూలంబైన మనంబులోనఁ గడుదుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ
సీలామాలపుఁ జింతనెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
ఇ
(0)
Add New Padyam
ఈ
(0)
Add New Padyam
ఉ
(0)
Add New Padyam
ఊ
(2)
Add New Padyam
ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండం గుహల్గల్గవో
చీరానీకము వీధులం దొరకదో, శీతామృత స్వచ్ఛవాః
పూరం బేరులఁ బారదో తపసులం బ్రోవంగ నీవోపవో
చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఊరూరన్ బవినీని కాండ్లు కవులై యొక్కొక్కచోఁ గొందఱన్
కేరే మీరును బాణకాదురనుచున్ గీతాలు బోధింపఁగా
సారాసారమెఱుంగలేక మిగులంజౌకయ్యెగా పద్యముల్
జేరంజోటికనేది సత్కవులకున్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
ఋ
(0)
Add New Padyam
ౠ
(0)
Add New Padyam
ఎ
(1)
Add New Padyam
ఎన్నేళ్ళుండుదు? నేమిగందు? నిక నేనెవ్వారి రక్షించెదన్?
నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా
కెన్నండబ్బెడు నెంతకాలమిక నేనిట్లున్న నన్నీయెడం?
చిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఏ
(2)
Add New Padyam
ఏ లీలన్నుతియింప వచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్య శ
బ్దాలంకార విశేషభాషల కలభ్యంబైన నీ రూపముం
చాలుంజాలుఁ గవిత్వము న్నిలుచునే సత్యంబు వర్ణించుచో
ఛీ ! లజ్జింపరు గాక మాదృశకవుల్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఏ వేదంబు పఠించె లూత, భుజగంబే శాస్త్రముల్చూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచే మంత్రమూహించె, భో
దావిర్భావనిధానముల్ చదువులయ్యా ? కావు! మీపాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఐ
(0)
Add New Padyam
ఒ
(3)
Add New Padyam
ఒక పూటించుక కూడు తక్కువగునే నోర్వంగలే, డెండకో
పక నీడన్వెదకుం, జలిం జడిసి కుంపట్లెత్తుకోఁ జూచు, వా
నకు నిళ్ళిళ్ళును దూరు, నీ తనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరుగాక మర్త్యులకటా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఒకయర్థంబును నిన్ను నే నడుగఁగా నూహింప నెట్లైన బొ
మ్ము కవిత్వంబులు నాకు జెందవని యేమోయంటివా నాదు జి
హ్వకు నైసర్గిక కృత్యమింతయు సుమీ ప్రార్థించుటే కాదు కో
రికల న్నిన్నును గాన నాకు వశమా శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
ఒకరింజంపి పదస్థులై బ్రతుక తామొక్కొక్కరూహింతురే
లొకొ ? తామెన్నడు జావరో ? తమకు బోవోసంపదల్ ? పుత్ర మి
త్ర కళత్రాదులతోడ నిత్యసుఖమందంగందురో ? యున్నవా
రికి లేదో మృతి యెన్నడుం గటకటా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఓ
(0)
Add New Padyam
ఔ
(0)
Add New Padyam
అం
(2)
Add New Padyam
అంతా సంశయమే శరీర ఘటనంబంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపర్వాన్వితమె, మేనంతా భయభ్రాంతమే
యంతానాంత శరీర శోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
చింతన్నిన్నుదలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయుఁ జింతనిల్పడు గదా శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
అః
(0)
Add New Padyam
క
(8)
Add New Padyam
కరి దైత్యున్బొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో , రతీ
శ్వరునిన్ కాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లారెనో
పరనిందా పరులన్వధింప విదియున్ భావ్యంబె ? వారేమి చే
సిరి నీకున్బరమోపకార మరయన్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Rajeshwari93
కలధౌతాద్రియు నస్థిమాలికయు, గోగంధర్వమున్బున్కయుం
బులితోలున్బసితంబు, బాపతొడవుల్పోకుండ, దోబుట్లకై
తొలినేవారల తోడబుట్టగ గళాదుల్గల్గె మేలయ్యె నా
సిలవుల్దూరము చేసి కొంటెరిగియే శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బులటంచుం దెవులంచు, దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా
దులటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతిఁ బుట్టించి నా
సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
కాయల్గాచె వధూనఖాగ్రములచే గాయంబు, వక్షోజముల్
రాయన్రాపడె ఱొమ్ము, మన్మథ విహారక్లేశ విభ్రాంతిచే
ప్రాయంబాయెను, బట్టగట్టె తల, చెప్పన్ రోత సంసారమే
జేయంజాల, విరక్తు జేయగదవే, శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
కాలద్వార కవాటబంధనము, దుష్కాల ప్రమాణక్రియా
లీలాచాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్ర జిహ్వాద్భుత
వ్యాళ వ్యాళవిరోధి, మృత్యుముఖదంష్ట్రాహార్య వజ్రంబు ది
క్చేలాలంకృత ! నీదు నామ మరయన్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
కాసంతైన సుఖంబొనర్చునొ, మనఃకామంబు లీడేర్చునో
వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతి గావించునో
దోసంబు ల్వెడబాపునో, వలసినం దోడ్తో మిముం జూపునో
ఛీ! సంసారదురాశలేలుడుపవో ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
కేదారాది సమస్త తీర్థములు కోర్కింజూడ బోనేటికిన్
గాదాముంగిలి వారణాసి కడుపే కైలాసశైలంబు నీ
పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞాన ల
క్ష్మీదారిద్ర్యులుగారె లోకు లకటా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
కొడుకుల్ పుట్టరటంచునేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ ? వారిచే నే గతుల్
వడసెం ? పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
ఖ
(0)
Add New Padyam
గ
(2)
Add New Padyam
గతినీవంచు భజించువార లపవర్గంబొందఁగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా "యాయురన్నం ప్రయ
చ్ఛతి" యంచున్మొఱవెట్టఁగా శ్రుతులు సంసారాంధకారాభిదూ
శిత దుర్మార్గులు గానఁ గానఁబడవో శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగానోవునే
దహనుంగప్పగ జాలునే శలభ సంతానంబు ? నీ సేవచే
సి హతక్లేశులు గారుగాక మనుజుల్ ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఘ
(1)
Add New Padyam
ఘడియల్ రెంటికొ మూటిఁకో ఘడియకో కాదేని నేఁడెల్లియో
కడనేఁడాదికొ యెన్నడో యెరుఁగ మీ కాయంబు లీ భూమిపైఁ
బడఁగానున్నవి, ధర్మమార్గమొక్కటిం బాటింపరీ మానవుల్
చెడుగుల్ నీ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఙ
(0)
Add New Padyam
చ
(5)
Add New Padyam
చదువుల్నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్
వదరన్, సంశయ భీకరాటవుల త్రోవల్దప్పి వర్తింపగా
మదనక్రోధ కిరాతులందు గని భీమప్రౌఢిచే దాకినం
చెదురుంజిత్తము, చిత్తగింపగదవే శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
చనువారిం గని యేడ్చువారు జముడా ! సత్యంబుగావత్తు మే
మనుమానం బికలేదు నమ్మమని తారావేళ నా రేవునన్
మునుగంబోవుచు బాసచేయుటసుమీ ముమ్మాటికింజూడగా
జెనటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Chary
చవిగాఁజూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాద మొం
ద వినిర్మించెదవేల జంతువుల నేతత్క్రీడలే పాతక
వ్యవహారంబులు సేయనేమిటికి మాయావిద్యచేఁ బ్రొద్దుపు
చ్చి వినోదింపగఁ దీన నేమిఫలమో శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
చావంగాలము చేరువౌ టెరింగియుం చాలింపగాలేక, త
న్నేవైద్యుండు చికిత్సఁ బ్రోవగలడో ? యేమందు రక్షించునో ?
ఏవేల్పుల్ కృపఁ జూతురో ? యనుచు, నిన్నింతైన చింతింపఁ డా
జీవచ్ఛ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
చెడుగుల్ కొందరు గూడి చేయఁగఁ బనుల్ చీకట్ల దూరంగ బా
ల్పడితింగాని చరింపరాని నిను నొల్లంజాలుఁ బొమ్మంచు ని
ల్వెడలం ద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కెఁ, గో
రెడి యర్థంబులు నాకు నేల యిడవో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఛ
(0)
Add New Padyam
జ
(4)
Add New Padyam
జలకంబుల్, రసముల్, ప్రసూనములు వాచాబంధముల్వాద్యము
ల్కల శబ్దధ్వను లంచితాంబర మలంకారంబు, దీప్తుల్మెరుం
గులు, నైవేద్యము మాధురీమహిమగాఁగొల్తున్నినున్ భక్తిరం
జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
జలజశ్రీ గల మంచినీళ్ళు గలవా ? చట్రాతిలో బాపురే !
వెలి వాడన్మఱి బాఁపనిల్లు గలదా ? వేసాలు గా కక్కటా !
నలి నా రెండు గుణంబులెంచి మదిలో నన్నేమి రోయంగ నీ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
జాతుల్సెప్పుట, సేవచేయుట, మృషల్ సంధించు టన్యాయవి
ఖ్యాతిం బొందుట, కొండెగాడవుట, హింసారంభకుండౌట, మి
థ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబు నాశించి, యీ
శ్రీ తానెన్ని యుగంబు లుండగలదో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
జ్ఞాతుల్ ద్రోహులు వాండ్రుసేయు కపటేర్ష్యాది క్రియాదోషముల్
మాతండ్రాన సహింపరాదు, ప్రతికర్మంబించుకే జేయగా
బోతే దోషముగాన మాని, యతినై పోగోరినన్ సర్వదా
చేతః క్రోధము మానదెట్లు నడుతున్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Chary
ఝ
(0)
Add New Padyam
ఞ
(0)
Add New Padyam
ట
(0)
Add New Padyam
ఠ
(0)
Add New Padyam
డ
(0)
Add New Padyam
ఢ
(0)
Add New Padyam
ణ
(0)
Add New Padyam
త
(8)
Add New Padyam
తనయుంగాంచి, ధనంబునించి, దివిజస్థానంబు గట్టించి, వి
ప్రున కుద్వాహము చేసి, సత్కృతికి పాత్రుండై, తటాకంబుఁ నే
ర్పున ద్రవ్వించి, వనంబువెట్టి, మననీ, పోలేడు నీ సేవ జే
సిన పుణ్యాత్ముడు పోవు లోకమునకున్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
తను వెందాక ధరిత్రినుండు ననునందాక న్మహారోగ దీ
పన దుఃఖాదుల బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
వెనుక న్నీ పద పద్మముల్దలచుచు న్విశ్వప్రపంచంబు బా
సిన చిత్తంబున నుండచేయ గదవే శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
తనువే నిత్యముగానొనర్పు మదిలేదా, చచ్చి, జన్మింపకుం
డ నుపాయంబు ఘటింపు, మీ గతులరెంటన్నేర్పులేకున్న లే
దని నాకిప్పుడె చెప్పు; చేయగల కార్యంబున్న సంసేవ జే
సి నినుంగాంచెదగాక కాలముననో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
తమ నేత్రద్యుతిఁ దామెచూడ సుఖమై తాదాత్త్యమున్గూర్పఁగా
విమలమ్ముల్కడు లాభము ల్జిత లసద్విద్యుల్లతా లాస్యముల్
సుమనోబాణ జయప్రదమ్ము లనుచున్ చూచున్ జనంబూని హా
రిమృగాక్షీనివహమ్ము కన్నుఁగవలన్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
తమకంబొప్పఁ బరాంగనాజన పరద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగముసేయు నెమ్మనము దొంగంబట్టి వైరాగ్య పా
శములంజుట్టి బిగించి నీదు చరణస్తంభంబునం గట్టివై
చి ముదంబెప్పుడు గల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
తరగల్ పిప్పలపత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావులతతుల్ ఖద్యోతకీటప్రభల్
సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపయఃపిండముల్
సిరులందేల మదాంధులౌదురు జనుల్ ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
తలమీదం గుసుమప్రసాద మలిక స్థానంబుపై భూతియున్
గళసీమంబున దండ నాసికతుద న్గంధప్రసారంబు లో
పల నైవేద్యము జేర్చునే మనుజు డా భక్తుండు నీకెప్పుడుం
జెలికాడై విహరించు రౌష్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
తాతల్ తల్లియుఁ దండ్రియున్ మరియు బెద్దల్చావగా చూడరో
భీతిం బొందఁగ నేల చావునకుఁగాఁ, బెండ్లాము బిడ్డల్హిత
వ్రాతంబుల్తిలకింప జంతువులకు న్వాలాయమై యుండఁగాఁ
జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
థ
(0)
Add New Padyam
ద
(7)
Add New Padyam
దంతంబుల్పడనప్పుడే తనువునం దార్ఢ్యంబు నున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె, జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేనఁ జరించనప్పుడె కురుల్వెల్వెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
దయఁజూడుండని గొందరాడుదురు నిత్యంబున్నినుం గొల్చుచున్
నియమంబెంతొ ఫలంబునంతియగదా ? నీవీయ పిండెంతొ యం
తియకా నెప్పటికిం దళం బశనబుద్ధిం జూడ నేలబ్బు న
త్క్రియలన్నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
దినముం జిత్తములో సువర్ణముఖరీతీరప్రదేశామ్ర కా
నన, మధ్యోపలవేదికాగ్రమున నానందంబునం పంకజా
సన నిష్ఠన్నిను జూడగన్న నదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
సిని మాయనటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
దివిజక్ష్మారుహ ధేను రత్నఘనభూతిన్ ప్రస్ఫురద్రత్నసా
నువు నీవిల్లు, నిధీశ్వరుండుసఖు, డర్ణోరాశి కన్యావిభుం
డు విశేషార్చకుఁ డింక నీ కెన ఘనుండున్ గల్గునే ? నీవు చూ
చి విచారింపవు లేమి యెవ్వడుడుపున్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
దురము న్దుర్గము రాయబారము మరిన్దొంగర్కము న్త్వెద్యమున్
నరనాథాశ్రయ మోడబేరమును బెన్మంత్రంము సిద్ధించినన్
అరయన్ దొడ్డఫలంబు గల్గు నదిగాకా కార్యమే తప్పినన్
సిరియుంబోవును బ్రాణహానియు నగున్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
దొప్పెండెంగిలి దెచ్చియిచ్చినను గండూషాంబుధారావళిన్
దొప్పం దోఁగిన చెప్పుగాల తలపై ద్రొక్కంగ నట్లైనఁ గ
న్నప్పం బాత్రుని జేసితింతటికి సన్మానంబు దీపింపఁగా
చెప్పన్నేరము నీ విహార మహిమల్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
ద్వారద్వారములందుఁ గంచుకిజన వ్రాతంబు దండంబులన్
దోరంతస్స్థలి బగ్గనంబొడుచుచున్ దుర్భాషలాడన్ మఱిన్
వారింభ్రార్థనచేసి రాజులకు సేవల్సేయగాఁ బోరు ల
క్ష్మీ రాజ్యంబును గోరి నీ పరిజనుల్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
ధ
(0)
Add New Padyam
న
(18)
Add New Padyam
నిచ్చల్ నిన్ను భజించి చిన్మయ మహానిర్వాణపీఠంబు పై
రచ్చల్సేయక, యార్జవంబు కుజనవ్రాతంబుచేగ్రాగి, భూ
భృచ్చండాలుర గొల్చి వారు దనుగోపింపన్ బుధుం డార్తుడై
చిచ్చారం జమురెల్ల జల్లుకొనునో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నిను నా వాకిలి గావుమంటినొ ? మరున్నీ లాలకభ్రాంతి గుం
టెన పొమ్మంటినొ ? యెంగిలిచ్చితిను తింటేగాని కాదంటినో ?
నిను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప చే
సిన నా విన్నపమేల గైకొనవయా ? శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నిను నిందించిన దక్షుపైఁ దెగవొ, వాణీనాథు శాసింపవో,
చనువా నీ పదపద్మ సేవకులఁ దుచ్ఛంబాడు దుర్మార్గులం
బెనుప న్నీకును నీఁదు భక్తతతికిన్ భేదంబు గానంగ వ
చ్చెనొ, లేకుండిన నూరకుండగలవా ? శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసారమోహంబు పై
కొననీ జ్ఞానముగల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నిన్నం జూడరొ మొన్నఁజూడరొ జనుల్ నిత్యంబుఁజావంగ నా
పన్నుల్గన్న నిధానమయ్యెడి ధనభ్రాంతి న్విసర్జింపలే
కున్నా రెన్నఁడు నిన్ను గందురిక మర్త్యుల్ గొల్వరేమో నిను
న్చిన్నంబుచ్చక ప్రోవకుండునెడలన్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
నిన్ను న్నమ్మినరీతి నమ్మనొరులన్ నీకన్ననా కెన్న లే
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుం డాపత్సహాయుండు నా
యన్నా ! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంభోది దాటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధిదేల్చేదొ కదే ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నిన్నేరూపముగా భజింతుమదిలో, నీ రూపుమోఁకాలొ, స్త్రీ
చన్నో, కుంచమొ, మేకపెంటికయొ ? యీ సందేహముల్మాన్పి, నా
కన్నారన్భవదీయమూర్తి సగుణాకారంబుగాఁ జూపవే
చిన్నీ రేజ విహారమత్త మధుపా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నిప్పై పాతక దూలశైలమడచున్ నీనామము న్మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుందారును ముక్తులౌదురని శాస్త్రంబు ల్మహాపండితుల్
చెప్పంగాఁ దమ కింక శంకవలెనా ? శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
నీ కారుణ్యము గల్గినట్టి నరుడే నీచాలయంబుం జొరం
డే కార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకోడే మతముల్భజింప డిల నే కష్టప్రకారంబులన్
చీకాకై చెడిపోడు జీవనదశన్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నీ పంచం బడియుండగా కలిగిన న్భిక్షాన్నమే చాలు, ని
క్షేపం బబ్బిన రాజకీయముల నే సేవింపగా నోప, నా
శాపాశంబుల జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై, బంటుగా
చేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నీ పేరున్, భవధంఘ్రి తీర్ధము భవన్నిష్ఠ్యూత తాంబూలముల్
నీ పళ్ళెంబు ప్రసాదమున్ గొనికదా నే బిడ్డడైనాడ న
న్నీ పాటిం గరుణింపు మోప నిక నే నెవ్వారికిం బిడ్డగాన్
చేపట్టందగు పట్టి మానఁదగదో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నీ భక్తు ల్పదివేల భంగుల నినున్సేవింపుచున్ వేడగా
లోభం బేటికి వారికోర్కులు కృపాళుత్వంబునం దీర్పరా
దా ! భవ్యంబు దలంచి చూడు పరమార్థంబిచ్చి పొమ్మన్న నీ
శ్రీ భాండారములో గొఱంత పడునా ? శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నీ రూపంబు దలంపగా తుదమొద ల్నేగాన నీవైననున్
రారా! రమ్మనియంచు చెప్పవు, వృథారంభంబు లింకేటికిన్
నీరన్ముంపుము, పాలముంపు మిక నిన్నే నమ్మినాడన్ జుమీ
శ్రీరామార్చిత పాదపద్మ యుగళా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నీకుం గాని కవిత్వమెవ్వరికి నే నీనంచు మీదెత్తితిన్
జేకొంటిన్ బిరుదంబు, కంకణము ముంజేగట్టితిం, బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతంబు, నా తనువుకీలున్ నేర్పులుం గావు, ఛీ
ఛీ ! కాలంబులరీతి దప్పెడుజుమీ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నీకున్ మాంసము వాంఛయేని కరువా? నీ చేతలేడుండగా
జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ నీరుండగా
పాకం బొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింప కా బోయచే
చేకొంటెంగిలి మాంస మిట్లు తగునా ? శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నీతో యుద్ధముఁ చేయనోప, గవితానిర్మాణ శక్తిన్నిన్నున్
బ్రీతుం చేయఁగలేను, నీ కొరకుఁ తండ్రిన్ జంపగాజాల నా
చేతన్ రోకట నిన్ను మొత్త వెరతున్ ; జీకాకు నా భక్తి యే
రీతి న్నాకిఁక నిన్ను చూడగనగున్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
నీనా యం దొడబాటుమాట వినుమా ! నీచేత జీతంబునేఁ
గానింబట్టక, సంతతంబు మదివేడ్కన్ గొల్తు, సంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియేచాలు, తే
జీనొల్లం గరినొల్ల నొల్లసిరులన్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
నీపై గావ్యము చెప్పుచున్న యతడు న్నీ పద్యముల్ వ్రాసి యి
మ్మా పాఠంబొనరింతు నన్నయతడున్ మంజుప్రబంధంబు ని
ష్టాపూర్తిం బఠియించుచున్నయతడున్ సద్బాంధవుల్ గాక ఛీ
ఛీ ! పృష్ఠాగత బాంధవంబు నిజమా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ప
(8)
Add New Padyam
పటవద్రజ్జుభుజంగవద్రజత విభ్రాంతి స్ఫురచ్ఛుక్తి వ
ద్ఘటవ చ్చంద్రశిలాజపాకుసుమ రుక్సాంగత్య వత్తంచు వా
క్పటిమల్నేర్తురు చిత్సుఖంబనుభవింపన్ లేక దుర్మేధసుల్
చిటుకన్నం దలపోయఁజూతురధముల్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
పదివేలైనను లోకకంటకులచేఁ బ్రాప్తించు సౌఖ్యంబు నా
మదికిం బథ్యముగాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా
న దయాదుల్గల రాజు నా కొసఁగు మెన్నన్వాని నీయట్ల చూ
చి దినంబున్ముద మొందుదుం గడపటన్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
పదునాల్గేలె మహాయుగంబులొక భూపాలుండు, చల్లించెన
య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొక డాయుష్మంతుడై వీరి య
భ్యుదయంబెవ్వరు చెప్పగా వినరొ ? యల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజులమంచు నక్కటకటా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో
గరహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితిన్ శంక వో
దరయం గుమ్మడికాయలోను యవగింజంతైన నమ్మించి సు
స్థిర విజ్ఞానము త్రోవఁ జూపగదవే శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
పవమానాశన భూషణప్రకరము, ల్భద్రేభచర్మంబు, నా
టకవిత్వంబు ప్రియంబులై, భుజగశుండాలాటవీచారులన్
భవదుఃఖంబుల బాపుటొప్పుఁ చెలదిం బాటించి కైవల్య మి
చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
పవి పుష్పంబగు, నగ్నిమంచగు, నకూపారంబు భూమీస్థలం
బవు, శత్రుండతిమిత్రుడౌ, విషముదివ్యాహారమౌనెన్నగా
నవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్
శివ ! నీ నామము సర్వవశ్యకరమౌ, శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
పాలుం బువ్వయుఁబెట్టెదన్, గుడువరా పాపన్న, రా యన్న, లే
లే లెమ్మన్న, నరంటి పండ్లు గొనితే, లేకున్ననే నొల్లనం
టే, లాలింపరె తల్లి తండ్రులపు డట్టే తెచ్చి, వాత్సల్య ల
క్ష్మీ లీలావచనంబులం గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
పుడమి న్నిన్నొక బిల్వపత్రమున నే పూజించి, పుణ్యంబునుం
బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులుం
గుడుముల్దోసెలు సారెసత్తు లటుకుల్ గుగ్గిళ్ళనుం బెట్టుచుం
జెడి, యెందుం కొరగాకపోదు రకటా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ఫ
(0)
Add New Padyam
బ
(0)
Add New Padyam
భ
(3)
Add New Padyam
భవకేళీమదిరామదంబున మహాపాపాత్ముఁడై వీఁడు న
న్ను వివేకింపఁడటంచు, నేను నరకార్ణోరాశిపాలైనఁ బ
ట్టవు? బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపకయుండునా కటకటా ! శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
భవదుఃఖంబులు రాజకీటముల నేఁ బ్రార్ధించినన్ బాయునే ?
భవదంఘ్రిస్తుతి చేతగాక, విలసద్బాలక్షుథాక్లేశ దు
ష్ట విధుల్మానునె ? చూడ మేకమెడచంటం తల్లి కారుణ్య దృ
ష్టి విశేషంబుననిచ్చుచంటవలెనో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
భసితోద్ధూళన ధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో
వ్యసనుల్ సాధితపంచవర్ణరసనుల్ వైరాగ్యవంతుల్ నితాం
తసుఖస్వాంతులు సత్యభాషణ సముద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్ తుదనెవ్వరైనఁ గొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
మ
(7)
Add New Padyam
మదమాతంగము లందలంబులు హరుల్మాణిక్యముల్పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీజాలునే
మదిలో వీని నపేక్షజేసి నృపధామద్వార దేశంబు గాం
చి దినంబుల్ వృథపుత్తురఙ్ఞు లకటా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
మల భూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో ! యారు కుం
డలియో పాదకరాక్షియుగ్మములు షట్చక్రంబులో! మోముదా
జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ ? గా
సిలి సేవింతురు కాంతలన్ భువిజనుల్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
మాయాజాండ కరండకోటి బొడిగా మర్ధించిరో విక్రమా
జేయుం గాయజు చంపిరో, కపటలక్ష్మీ మోహముల్ బాసిరో,
యాయుర్ధాయ భుజంగ మృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో,
శ్రేయోదాయకులౌదు రెట్టు లితరుల్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
మును నీచే నపవర్గ రాజ్యపదవీమూర్ధాభిశేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
ట్లనినం గీటఫణీంద్రపోతమదవేదండోగ్ర హింసావిచా
రినిఁగాఁగా నినుఁగానఁగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
మును నేఁ బుట్టిన పుట్టులెన్నిగలవో, మోహంబుచే నందుఁ జే
సిన కర్మంబుల ప్రోవులెన్నిగలవో, చింతించినం గాని, యీ
జననంబే యని యున్నవాడ నిదియే చాలింపవే నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
మొదలన్ జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ చేసి దు
ర్మదులై యిప్పుడు వారధర్మములొనర్పం, దమ్ము దైవంబు న
వ్వదె ? రానున్న దురాత్ములెల్ల తమ త్రోవంబోవరే యేల చే
సెదరో మీఁదు దలంచి చూడకధముల్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
మొదలన్ భక్తులకిచ్చినాఁడవు గదా మోక్షంబు నేఁడేమయా
ముదియంగా ముదియంగఁబుట్టె ఘనమౌ మోహంబు లోభంబున
న్నది సత్యంబు కృపందలంప వొక పుణ్యాత్ముండు నిన్నాత్మ గొ
ల్చి దినంబున్మొఱవెట్టఁగా గటకటా ! శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
య
(0)
Add New Padyam
ర
(8)
Add New Padyam
రతిరాజుద్ధతి మీఱనొక్క మఱి గోరాజాశ్వునిన్ నొక్కఁబో
నతఁడా దర్పకు వేగ నొత్తఁ గవయం బాఁబోతునుందాఁకి యు
గ్రతఁ బోరాడఁగ నున్న యన్నడిమి లేఁగల్వోలె శోకానల
స్థితిపాలై మొఱపెట్టినన్ మనుపవే శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
రాజన్నంతనె పోవునా ? కృపయు, ధర్మం, బాభిజాత్యంబు, వి
ద్యాజాతక్షమ, సత్యభాషణము, విద్వన్మిత్ర సంరక్షయున్,
సౌజన్యంబు, కృతంబెఱుంగుటయు, విశ్వాసంబు గాకున్న దు
ర్బీజశ్రేష్ఠులుగా గతంబుగలదే శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Chary
రాజర్థాతురుడైనచో నెచట ధర్మంబుండు ? నేరీతి నా
నాజాతి క్రియలేర్పడున్ ? సుఖము మాన్యశ్రేణికెట్లబ్బు ? రూ
పాజీవాళికి నేది దిక్కు ? ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ
రేజంబుల్ భజియింతు రే తెరగునన్ ? శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరఁగా సౌఖ్యమో
యీ జన్మంబు తరింపఁజేయఁగల మిమ్మే ప్రొద్దు సేవించు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరో మానవు ల్బాపరా
జీజాతాది మదాంధ బుద్ధులగుచున్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా
బీజంబుల్, తదపేక్ష చాలు, పరితృప్తింబొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో, శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
రాజై దుష్కృతి చెందె చందురుడు, రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబున గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుడా మాటనే
యాజింగూలె సమస్త బంధువులతో, నారాజ శబ్దంబు ఛీ,
ఛీ ! జన్మాంతరమందు నొల్లనుజుమీ ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
రోసిందేఁటిది రోఁతలేఁటిది మనోరోగస్థుఁడై దేహి తాఁ
బూసిందేఁటిది పూఁతలేఁటివి మదాపూతంబులీ దేహంబుల్
మూసిందేఁటిది మూఁతలేఁటివి సదా మూఢత్వమే కాని తాఁ
జేసిందేఁటిది చేఁతలేఁటివి వృథా శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్,
పాసీపాయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి, వాంఛాలతల్
కోసీకోయదు నామనం బకట ! నీకున్ ప్రీతిగా సత్క్రియల్
చేసీచేయదు, దీనిత్రుళ్ళణపవే ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ల
(1)
Add New Padyam
లేవో కానలఁ గందమూలఫలముల్, లేవో గుహ ల్తోయముల్
లేవో యేఱుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో
లేవో నీవు విరక్తులన్మనుప, జాలింబొంది, భూపాలురన్
సేవల్సేయగ బోదురేలొకొ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
వ
(6)
Add New Padyam
వన్నే యేనుగుతోలు దుప్పటము, బువ్వాకాలకూటంబు, చే
గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు, మే
ల్నిన్నీలాగున నుండియుం తెలిసియు న్నీ పాదపద్మంబు చే
ర్చెన్నారాయణుడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబు నన్నిల్చి, ని
ర్వాణశ్రీఁ జెఱపట్ట చూచిన విచారద్రోహమో, నిత్య క
ల్యాణక్రీడలఁబాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీద్వారము దూరఁ జేసి దిపుడో శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
విత్తజ్ఞానము పాడుచిత్తము, భవావేశంబు రక్షాంబువుల్
మత్తత్త్వంబు తదంకురం బనృతముల్, మారాకులత్యంత దు
ర్వృత్తుల్ పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులుం
జిత్తాభ్యున్నత నింబ భూజమునకున్, శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
వీడెంబబ్బినయప్పుడున్ దమస్తుతుల్ విన్నప్పుడుం బొట్టలో
కూడున్నప్పుడు శ్రీవిలాసములుపైకొన్నప్పుడున్ గాయకుల్
పాడంగా వినునప్పుడున్ జెలగు ధంభప్రాయువిశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్
వెనుకన్ముందటవచ్చు దుర్మరణము ల్వీక్షింప భీతయ్యెడున్
నను నేఁ జూచియు నా విధుల్దలచియు న్నాకే భయంబయ్యెడుం
జెనకుంజీకటినాయెఁ గాలమునకున్ శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
వేధం దిట్టగరాదు గాని భువిలో విద్వాంసులం జేయనే
లా ధీచాతురిఁ జేసిఁ జేసిన గులామాపాటునే పోక క్షు
ద్బాధాదుల్ కలిగింపనేల యదికృత్యంబైన దుర్మార్గులం
ఛీ ! ధాత్రీశులఁ జేయనేటి కకటా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
శ
(4)
Add New Padyam
శుకము ల్కింశుకపుష్పము ల్గని ఫలస్తోమంబటంచు న్సము
త్సుకతం జేరగబోవ నచ్చట మహాదుఃఖంబు సిద్ధించుఁ గ
ర్మ కళాభాషలకెల్ల ప్రాపులగు శాస్త్రంబు ల్విలోకించువా
రికి నిత్యత్వమనీష దూరమగునో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
శ్రీ విద్యుత్కలితాజవంజవ మహా జీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోజ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా ! మీ కరుణా శరత్సమయ మింతేఁ జాలు, సద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
శ్రీశైలేశు భజింతునో, యభవుఁ గాంచీనాథు సేవింతునో
కాశీవల్లభుఁ గొల్వబోదునొ, మహిన్ కాళేశుఁ బూజింతునో
నా శీలంబణువైన మేరువనుచున్ రక్షింపవే, నీ కృపా
శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్శోధించి తత్త్వంబులన్
మతినూహించి, శరీరమస్థిరము, బ్రహ్మంబన్న, సత్యంబు గాం
చితిమంచున్ సభలన్ వృథావచనము ల్చెప్పంగనే కాని, ని
ర్జిత చిత్తస్థిరసౌఖ్యముల్ తెలియరో శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
ష
(0)
Add New Padyam
స
(6)
Add New Padyam
సంతోషించితి చాలు చాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్
శాంతిన్ బొందితి చాలు చాలు బహురాజద్వార సౌఖ్యంబులన్
శాంతిం బొందెద జూపు బ్రహ్మపద రాజద్వార సౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
సంపద్గర్వముఁ బారద్రోలి, రిపులన్ జంకించి, యాకాంక్షలన్
దంపుల్వెట్టి, కళంకముల్నఱికి, బంధక్లేశ దోషంబులన్
జింపుల్చేసి, వయోవిలాసములు సంక్షేపించి, భూతంబులన్
జెంపల్వేయక నిన్నుఁ గాననగునా ? శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
సలిలమ్ము ల్చిలుకప్రమాణ మొక పుష్పమ్ము న్భవన్మౌళి ని
శ్చలభక్తి ప్రతిపత్తిచే నరుడు పూజన్సేయగా ధన్యుడౌ
నిల గంగాజల చంద్రఖండముల దా నిందుం దుదింగాంచు నీ
చెలువంబంతయు నీ మాహత్త్యమిదిగా శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam
సులభుల్మూర్ఖు లనుత్తమోత్తములు రాజుల్గల్గి యేవేళన
న్నలఁతం బెట్టిన నీ పదాబ్జములఁ బాయంజాల నేమిచ్చినం
గలధౌతాచల మేలుటంబునిధిలోఁ గాపుండుటబ్జంబుపైఁ
జెలువొప్పన్సుఖియింపఁ గాంచుటసుమీ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
స్తోత్రంబన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ
బుత్త్రీపుత్త్ర కళత్రరక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్
బాత్రంబంచు భజింపఁబోదు రిదియు న్బావ్యంబె యెవ్వారి చా
రిత్రంబెన్నఁడు మెచ్చనెంత మదిలో శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
స్వామిద్రోహముచేసి, వేరొకని కొల్వన్ బోతినో, కాక నే
నీమాటల్విన నొల్ల కుండితినో, నిన్నే దిక్కుగా జూడనో ?
యేమీ యిట్టి వృథాపరాధియగు నన్నీ దుఃఖవారాశి వీ
చీమధ్యంబున ముంచి యుంపఁదగునా ? శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Dsubrahmanyam
హ
(0)
Add New Padyam
ళ
(0)
Add New Padyam
క్ష
(2)
Add New Padyam
క్షితినాథోత్తమ ! సత్కవీశ్వరుఁడు వచ్చెన్ మిమ్ములంజూడఁగా
నతఁడే మేటి కవిత్వవైఖరిని ? సద్యఃకావ్యవిర్మాత త
త్ప్రతిభ ల్మంచివి తిట్టుపద్యములు చెప్పండాతఁడైనన్ మముం
గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
క్షితిలో దొడ్డతురంగసామజములే చిత్రమ్ము లాందోళికా
తతులే లెక్క విలాసినీజన సువస్త్రవ్రాత భూషాకలా
ప తనూజాదికమేమి దుర్లభము నీ పాదమ్ము లర్చించుచో
జితపంకేరుహ పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా !
- Added By
Chary
ఱ
(1)
Add New Padyam
ఱాలన్ ఱువ్వగ చేతులాడవు, కుమారా రమ్మురమ్మంచు నే
చాలన్ చంపగ, నేత్రము ల్దివియగా శక్తుండ నే గాను, నా
శీలంబేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు, నా భాగ్యమో
శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా ! శ్రీకాళహస్తీశ్వరా !!
- Added By
Dsubrahmanyam