ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో పింగళి, కాటూరి కవులకు ఒక విశిష్టస్థానం ఉంది. ఈ జంటకవుల పేరు వినగానే "సౌందరనందము" గుర్తుకు వస్తుంది. "గుడిగంటలు", "పౌలస్త్య హృదయము", "తొలకరి" మొదలైన వారి ఇతర రచనలు ఆంధ్రభాషామతల్లికి అమూల్యాలంకారాలు. ఈ కవుల "తొలకరి" అనే కవితాసంకలనంలో, "రసాలము" అనే ఖండికలో - కేవలం ఏడు పద్యాలున్నాయి. దానిలోని మహత్తర సందేశాన్ని మనం ఒకసారి మననం చేసుకుందాం. రసాలము అంటే మామిడిచెట్టు. దానినుంచి మనం అందుకోదగిన సందేశమేమిటో చెప్పారీకవులు. "తరువులు మనకు గురువులు" అన్నారు కదా పెద్దలు. మామిడి చెట్టును తోటవాకిటిలో నిలబడిన శోభనదేవతగా వీరు వర్ణించిన తీరు చూడండి - "పరిణత సత్ఫలమ్ముల, సువానలీను సుమమ్ములన్, మనో హరమగు తేనెదొన్నెల, లతాంత రజమ్మను కుంకుమమ్ముఁబ ళ్ళెరమున నించి, చేతగొని లేనగవొప్పగఁదోట వాకిటన్ సురుచిర మూర్తితో నిలుచు శోభనదేవతవీవు భూజమా !" |
"ఓవృక్షమా! పండిన పళ్ళు, సువానతో అలరారే పువ్వులు, తేనెదొన్నెలు, పుప్పొడి అనే కుంకుమ ఉన్న ఒక పళ్ళెం చేతులతో పట్టుకొని మనోహర రూపంతో, చిరునవ్వుతో తోట వాకిట – నిలచిన మంగళమూర్తివి నువ్వు" అని ప్రశంసించారు. ఈ కవితాత్మక వాక్యాలలో సమస్త సౌభాగ్యాలతో కళకళ లాడే ఒక స్త్రీ మూర్తి మన ఊహలో మెదలుతుంది. కాలవశాన మనిషికైనా, మానుకైనా వెలుగు,నీడలు తప్పవు. మనుజులు కష్ట, సుఖాలకు అవధులుమీరి క్రుంగిపోతారు, పొంగిపోతారు. ఏ కొద్దిపాటి వ్యతిరేకతనూ సహించలేరు. స్థితప్రజ్ఞులు మాత్రం ప్రకృతిలోని ద్వంద్వాలను సమానంగా స్వీకరిస్తారు. ఆ స్థితినే రసాల జీవనానికి అన్వయించిన ఈ కవుల ప్రతిభ ఈ క్రింది పద్యంలో చూడవచ్చు – "కాలవశమ్మునన్ విసరుగాడ్పులకున్ ముదురాకు పుట్టముల్ రాలగ,బాటసారులఁబరామరసింపగలేక, సంపదల్ దూలిన దాతవోలె జిగిదూలిన యీయెలమావిగున్న యా కాలవశమ్ము చేతనె సఖా! వికసించెడి సౌరుఁగంటివే!" |
|
|