"మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్ మన విభుడు, గురువు, దేవర మనలనుఁదిగనాడి చనియె మనుజాధీశా!" | అని శ్రీకృష్ణనిర్యాణవార్తను ధర్మరాజుకు చెప్పలేక చెప్పి బోరున విలపించాడు అర్జునుడు. ఈ రోజున భగవాన్ శ్రీసత్యసాయిబాబా నిర్యాణవార్తకూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయిభక్తులకు అంతటి ఖేదాన్ని కలిగిస్తున్న మాట యథార్థం. ప్రేమకు, మానవత్వానికి రూపమే భగవాన్ సత్యసాయిబాబా. ఆయన గడచిన కొన్నిరోజులుగా అస్వస్థులై ఆసుపత్రిలో ఉంటే, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలనీ, మళ్ళీ ప్రశాంతినిలయానికి వచ్చి అందరికీ తమ దర్శనసౌభాగ్యం ప్రసాదించాలనీ ఎంతో ఆర్తితో విశ్వ వ్యాప్తంగా భక్తులందరూ యజ్ఞాలు, భజనలు నిర్వహించారు. ఇన్ని కోట్లమంది ఆయన ఆరోగ్యం కోసం పరితపించటమే స్వామి దైవత్వానికి నిదర్శనం. సమాజరూప సర్వేశ్వరసేవను మానవాళికి నేర్పటమే స్వామి అవతార ప్రధానోద్దేశ్యం. ప్రపంచంలో మరెక్కడా వినిపించని ఒక ప్రేమమయ స్వరం భగవాన్ గొంతులో వినిపించేది. అందుకే ఆ ప్రేమ మాధుర్యాన్ని అన్వేషిస్తూ ప్రపంచం పుట్టపర్తికి తరలి వస్తుంది. "బంగారూ!" అని ఎంతో ప్రేమగా అందరినీ సంబోధించేవారు భగవాన్ బాబా. స్వామిని దర్శించేవేళ అప్రయత్నంగా కళ్ళలోంచి అశ్రువులు కురుస్తాయి. మన దేహవలయాన్ని అధిగమించి మనలోని ఆత్మ, ఆ పరమాత్మను దర్శించటం వల్ల కలిగే ఆనందపారవశ్యం కాబోలు అది! స్వామి సందేశాలు ఎంతో అపురూపమైనవి. పద్యాలతో, పాటలతో, చిన్నకథలతో, చమత్కారంతో సాగే ఆయన ప్రసంగాలు అందరిలోనూ ఆనందాన్ని నింపేవి. ఆచరణాత్మకమైన ఆదర్శాలను ప్రబోధించేవి. ఆయన ప్రతిపాదించిన సర్వమత సమానత్వం ప్రపంచ శాంతికి, వసుధైక కుటుంబ భావనకు బలం చేకూర్చింది. "ఇతర మతములను గౌరవించక, నన్ను పూజించేవాడు సత్యసాయి సంస్థలోని సభ్యునిగా ఉండటానికి ప్రాథమికంగా అనర్హుడు" అనేవారు. "నువ్వు దేవుడివా ?" అని అడిగినవారికి "నువ్వూ దేవుడివే!" అని ప్రేమగా జవాబు చెప్పారాయన. అందుకే ఏ ఉపన్యాసమైనా "దివ్యాత్మస్వరూపులారా! ప్రేమస్వరూపులారా !" అనిసంబోధిస్తూ ప్రారంభించేవారు.
|
|