అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరాపండగకు శమీపూజ చేయడం మన సంప్రదాయం. శమీవృక్షము పేరు వినగానే ఠక్కున మనకు మహాభారతములోని విరాటపర్వగాథ గుర్తుకు వస్తుంది. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేయ నిశ్చయించుకున్న పాండవులు, తమ ఆయుధాలను శమీవృక్షముపై వుంచి బయలుదేరుతారు. ఆ మహాభారత కథానాయికే ద్రౌపదీదేవి. ఇతిహాసములు, కావ్యములు, ప్రబంధములు అన్నింటిలోనూ ద్రౌపదివంటి విలక్షణ నాయిక మనకు మరెక్కడా కనిపించదు. భారతీయసాహిత్యములోనే కాదు; బహుశా ప్రపంచసాహిత్యములో కూడా అటువంటి పాత్ర యింకెక్కడా గోచరించదంటే అతిశయోక్తి కాదేమో!...... మరి, అంతటి విలక్షణ స్త్రీమూర్తి ద్రౌపది యొక్క ఆంతర్యములో యెన్నెన్ని విరుద్ధభావాలు సుడులుతిరిగివుంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా!......... జీవితం నటన కాదు. నటనలో జీవించేవారికీ, జీవితములో నటించేవారికీ కూడా నటనకు సంబంధించని వేరే జీవితం వుంటుంది. ఉండకపోతే వాళ్ళంత దురదృష్టవంతులు లోకములో వుండరు. లోకములో వున్న దురదృష్టవతులందరిలోనూ మరీ దురదృష్టవతిగా కనబడుతుంది నాకు ద్రౌపది. ఎందరో మగవారికి యే అరమరికలూ లేకుండా శరీరాన్ని అప్పగించిన స్త్రీలున్నారు. ఒకరి తర్వాత ఒకరినిగా యెందరో భర్తలను కట్టుకున్న స్త్రీలూ వున్నారు. కాని, ఒకేసారి ఐదుగురిని పెళ్ళాడిన స్త్రీ - జీవితాంతం ఆ ఐదుగురితోనూ కాపురం చేసిన స్త్రీ - ఎన్నడూ ఆ ఐదుగురి మధ్య దాంపత్యసంబంధమైన అనుమానముగానీ, అసూయగానీ, అసంతృప్తిగానీ కలగనీయకుండా నిర్వహించుకువచ్చిన స్త్రీ చరిత్రలో మరెవరైనా వున్నారేమో వెదికిచూడండి. వంతుల ప్రకారం ఐదుగురితో కాపురం చేయటం ఏ భార్యకూ సహజం కాదు. సహజం కాని యీ బాధ్యత తెచ్చిపెట్టే మానసికసమస్యలను వ్యాసుడు గుర్తించలేదు. కుంతి పట్టించుకోలేదు. ద్రుపదుడు ఊహించలేదు. పాండవులలో ఒక్కరూ అర్థంచేసుకున్న దాఖలా లేదు. అర్జునుని కోసమే పుట్టిన తాను, అర్జునుని కోసం కలలు కనటం తప్ప మరేమీ తెలియని తాను, అర్జునుని రప్పించటం కోసమే యేర్పాటైన స్వయంవరములో గొప్ప తేజస్వి ఒకడు మత్స్యయంత్రాన్ని కొట్టి తనను గెలుచుకున్నవేళ......
|
|