సిద్ధార్థుడు సన్యాసం స్వీకరించే సమయమైంది. పతియే ప్రత్యక్ష దైవమనుకొన్న రాణీ యశోధరకు ముచ్చెమటలు పట్టాయి. పసివాడైన పుత్రుని మహారాజు పాదాలపై పెట్టి "ప్రభూ ! మీ కనురెప్పల మాటున ఒదిగి ఇన్నాళ్ళూ ఉన్నాము. ఇప్పుడు ఒక్కసారిగా ఈ విశాల భువిపై మమ్ముల విడిచి తాము పోవనెంచ భరింపశక్యమే" అని విలపించ సాగింది. చిన్న చిరునవ్వు సమాధానం చేసిన సిద్ధార్థుడు తిరిగైనా చూడక ముందుకేగాడు.
పతివెంట పరుగెడుతున్న మహారాణీ వారి దుస్థితి కి వగచి రాజ్య ప్రజలంతా గగ్గోలుగా మహారాజును వెన్నంటి నడవసాగారు. రాజ్యపు పొలిమేరవరకు అలా సాగిన పయనం మహారాజు ఆగిపోవడం తో ఆగింది. వెనక్కి చూసిన సిద్ధార్థుడు ఒక పుల్ల తీసుకొని ఒక గీత గీసి నేను ఈ రాజ్యపు మహారాజును, ఈ గీత దాటి ఎవరూ రావలదని శాసించి ముందుకేగాడు. ప్రజలంతా రాజాజ్ఞ ధిక్కరించలేక ఆగిపోయినా యశోధరలోని స్త్రీత్వం ఆమెను ఆగనీయలేదు. ఆగలేక గీత దాటి మహారాజా అని మొరలిడుతూ వెంట నడిచింది. ఇదేమి మహారాణివైయుండి నువ్వే నా మాట ధిక్కరిస్తే ప్రజలకు సన్మార్గము ఎలా చూపగలవని ప్రశ్నించాడు బోధిసత్వుడు. "ప్రభూ ! మీరు మహారాజు కాకమునుపే నాకు పతిదేవులు. నా భర్త నాకు ముఖ్యం, వారిని అనుసరించుట నా ధర్మం. అదియే గాక తమరు ధర్మేచ అర్థేచ, కామేచ , మోక్షేచ నాతి చరామి అని ఉన్నారు. మీ వెంటే నేను" అని అమాయకంగా జవాబిచ్చింది.
"దేవీ ! కుమారుడు పెరిగిన తదుపరి నువ్వు సన్యసిద్దువు ఇప్పుడు నన్ను పోనిమ్ము" అని ముందుకేగాడు. కానీ యశోధరలోని సతీధర్మం బుద్ధుని అనుసరింప పురిగొల్పింది. కొంతదూరం సాగినపిదప వెన్నంటివచ్చే సతిని సమాధానపరచదలచి చుట్టూ చూసిన సిద్ధార్ధుడికి ఒక ఇంటి ముందు ఇరువురు మహిళలు రోటిలో జొన్నలు పోసుకొని ఒకరి తదుపరి మరియొకరు సువ్వి సువ్వి అనుకొంటూ దంచడం కనిపించింది. యశోధరకు ఆ దృశ్యము చూపి వారిరువురూ ఒకేపరి పోటు వేసిన త్వరగా గింజలు నలుగును కదా అని ప్రశ్నించాడు. అంతఃపురాన ఉండే అసూర్యంపశ్య అయిన యశోధరకు ఏమి చెప్పాలో తెలియక అసలా ప్రశ్న అప్పుడెందుకు ఉదయించిందో అర్థంకాక ఖిన్నురాలై మిన్నకుంది. "సరే రమ్ము వారినే అడుగుదాము" అని వారివద్దకేగాడు యశోధర వెంటరాగా. వారిదరికేగి "అమ్మా తమరిరువురు ఒకే పరి పోటు వేసిన త్వరగా నలుగును కదా ?" అనగా వారు ఫక్కున నవ్వుతూ "ఓయీ వెర్రిబాగుల వానివలే ఉన్నావే ! ఒకటైతే గింజలు దంచుతుంది. రెండైతే ఒకదానినొకటి దంచుకొంటాయి గాని గింజలను దంచవయ్యా" అన్నారు. "చూసితివా దేవీ సన్యాసము కూడా ఇటువంటిదే. నువ్ తోడొచ్చిన తిరిగి సంసారిక ప్రాపంచిక విషయాలు ఈ జొన్నల వలే నలుగక నన్ను వేధిస్తాయి. కావున మరలిపొమ్ము" అన్నాడు. వినలేదు తనపట్టూ వీడలేదు యశోధర. రోలు వైశాల్యము తక్కువ కానీ మీ ఎడద వైశాల్యం నాకు తెలుసు ప్రభూ నన్నూ మీతో రానిండు అంటూ అనుసరించింది.