Type In Telugu
Article 282


ఆనందం మనసులోనే
Prev Article
 
Next Article
 

User Rating : <None> Number Of Views : 904
Votes: 0  (Vote) Posted On 9/13/2008 @5:59:50 AM
         ' ఆనందం ' మూడక్షరాల ఈ పదానికి మనిషిని మూడులోకాలకూ అధిపతిని చేయగల సామర్ధ్యమున్నది. అంత గొప్ప అనుభూతి ఇది.

         ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్.....అనందం పరబ్రహ్మ స్వరూపం. దానివల్లనే జీవులన్నీ జన్మిస్తున్నాయి, వృద్ది పొందుతున్నాయి, అందులోనే లయం చెందుతున్నాయని అంటున్నది తైత్తిరీయోపనిషత్తులోని భ్రుగు వల్లి (6వ అనువాకం). ఎవరో ఒక సాధారణ వ్యక్తి చెప్పిన మాట కాదిది. వరుణుడి కుమారుడైన భ్రుగువుకు తపస్సు వలన కలిగిని స్వీయానుభూతి; వేదవాక్కు.

         అనందమనెది అంత గొప్పది కదా! అదెక్కద ఉన్నదని ప్రశ్న. దీన్నికి సరైన సమాధానం దొరకక, దొరికినా ఒకరి అభిప్రాయాన్నిమరొకరు అంగీకరించక సమాజం గజిబిజి పాలౌతున్నది. ఆనందమనేది బయట ఎక్కడనో లేదు. ఏ వస్తువులోనో లేదు. మన మనస్సులోనే ఉన్నది. మన స్థితిని బట్టే ఆనందంగానీ, విషాదంగానీ! తిరుగులేని సత్యమిది.

         'నీకు ఏ పదార్దం తింటే ఆనందంగా ఉంటుంది?' అని ఒకాయనను అడిగాం. 'పరమాన్నం తాగితే!' అన్నాడాయన. 'పరమాన్నంలో ఏమున్నది? గారైతే స్వర్గానికి బెత్తెడు దూరమే'! అన్నాడు మరొకాయన. చూశారా? ఒకరికి ఆనందాన్ని కలిగించిన పదార్థం మరొకరికి కలిగించటం లేదు. ఒక ఇంట్లో అన్నగారు తీరని సంస్యతో సతమతమౌతున్నాడు. తమ్ముడు వ్యాపారం లో మంచి లాభం వచ్చి హుషారుగా ఉన్నాడు. ఆ సమయంలో పిల్లవాడు వచ్చి రేడియో పెట్టాడు. పాట వస్తున్నది- మంచి పాటే ఆ పాట మొదటి వాడికి ఎక్కడా లేని కోపాన్ని తెప్పించింది; రెండో వాడికి అనందాన్ని రెట్టింపు చేసింది. తేడా ఎక్కడ ఉన్నది ? రేడియో పాటలో లేదు. మనుషుల మనస్సులలోనే!

         ఇద్దరి దాకా ఎందుకు? మనం ఒక్కళ్ళమే ఉన్నాం. ప్రశాంతం గా టీవీ చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉన్నది. అమ్మ డబ్బులడిగింది. జేజెబులో చెయ్యి పెట్టాం. నిన్న రాత్రి అందులో పెట్టిన వెయ్యి రూపాయలు లేవు. జేబులన్నీ వెతికాం, ఇంకా కొన్ని చోట్ల వెతికాం. డబ్బులేదు. ఆనందమంతా మాయం; కంగారు; దిగులు, టివీ లో కార్యక్రమం నడుస్తూనే ఉన్నది. 'అరే! టీవీ ఆపండిరా!' కోపంగా ఓ కేక వేస్తాం, అరుస్తాం, ఇందాక ఆనందాన్ని కలిగించిన టీవీ ఇప్పుడు కోపాన్ని ఎందుకు తెప్పించింది? మన స్థితి మారటం వల్లనే!

         ఆనందం కోపంలో లేదు; శాంతం లో ఉన్నది. వైరం లో లేదు, స్నేహితం లో ఉన్నది. మితిమీరిన కోరికలో లేదు, తృప్తి లో ఉన్నది. ముందుగా మనమందరమూ ఆనందమనేది మన మనస్సులోనే ఉన్నది అని గుర్తించాలి. అనవసరంగా కోపాన్ని, చికాకును తెప్పించుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎవ్వరితోనూ తగాదాలు పెట్టుకోకుండా నలుగురితోనూ మంచిగా ఉండాలి. వచ్చిన దానితో తృప్తి పడాలి, మరొక మెట్టు పైకి ఎదగడానికి ప్రయత్నించాలి. అప్పుడు మన జీవితం ఆనందమయమవుతుంది. ఆనందానికి అసలైన రహస్యమిది. దానిని సొంతం చేసుకోవటానికి ఏకైక మార్గమిదే.

- సేకరణ (డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి)

View Comments(3)    Post a Comment    By - అనిల్ కుమార్ నెల్లూరు