Type In Telugu
Article 238


ఊర్మిళాదేవి నిద్ర   (Page 1 Of 5)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 2008
Votes: 6  (Vote) Posted On 8/30/2008 @8:55:29 PM

         ఇటీవల ఇల్లంతా శుభ్రం చేయడానికి సర్దుతూంటే పుస్తకాల బీరువా లోపలి అరలో నుండి కొన్ని పాత పుస్తకాలు బయటపడ్డాయి. అందులో ఒకటి రామాయణానికి సంబంధించిన స్త్రీల పాటల పుస్తకం. అక్కడక్కడా శిధిలం అయిపోయి ఉన్న ఆ పొత్తంలో రచయిత/రచయిత్రి పేరు గోచరించలేదు.

         రామాయణం ఆబాలగోపాలానికీ ఆదరపాత్రమైన మహాకావ్యం. అందులోనూ మన తెలుగువారికి సీతారాములు ఆరాధ్యదైవాలు. తెలుగుదేశంలో శ్రీరాముని గుడిలేని గ్రామం లేదు.

         తెలుగువాడు "శ్రీరామ" చుట్టకుండా ఏ వ్రాతా ప్రారంభించడు. మన గోదావరీ తీరం సీతారాముల పవిత్ర పాదపరాగాలతో పులకించిపోయింది. అందువల్లనే రామకథ అంటే ఆంధ్రులకు అంతులేని అభిమానం. తెలుగుభాషలో ఉన్నన్ని రామాయణాలు మరే ఇతర భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు.

         మరీ ముఖ్యంగా, తెలుగు జానపదులకు (పల్లెవాసులకు) సీతారాములే తల్లిదండ్రులు. సుఖానికి, దుఃఖానికి వారికి రామనామమే శరణ్యం. ఆ ఆదర్శ పురాణదంపతులు తమ అరణ్యవాస కాలంలో కొన్నాళ్ళు మన గోదావరీతీరంలో నివసించటం మన పూర్వపుణ్యం. నాటి నుండి నేటి వరకూ గోదావరితల్లి గుండె గలగలలు వింటున్న తెలుగు జానపదులకు తెలిసినన్ని రామాయణ రహస్యాలు ఇతరులకు తెలియవేమో!... రామాయణం వారి నోళ్ళలో చిలవలు, పలవలుగా అల్లుకొన్నది. వాల్మీకిమహర్షి విరచితమైన మూలరామాయణంలో లేని అనేక సంఘటనలు మన జానపదస్త్రీలు మనోహరమైనరీతిలో పాటలుగా అల్లి పాడుకొన్నారు.

         ఆ పాటలలో ముఖ్యంగా "ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు" చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీటిలో మొదటిదైన "ఊర్మిళాదేవి నిద్ర"లోని కొన్ని సొగసైన సన్నివేశాలను మీ ముందుకు తేవాలనేదే నా ప్రయత్నం.

         రామాయణకావ్యంలో మహర్షి వాల్మీకి ఎన్నో అద్భుతమైన పాత్రలను సృష్టించాడు. అన్యోన్య దాంపత్యానికి సీతారాములను, పితృవాక్య పరిపాలనకు శ్రీరాముడిని, పతిభక్తికి సీతాదేవిని, భ్రాతౄభక్తికి భరతుడిని, సేవాభావానికి లక్ష్మణుడిని ఆదర్శంగా పేర్కొంటారు. అయితే, ఎందువల్లనో గాని లక్ష్మణుని సతీమణి ఊర్మిళ పాత్రను అందరూ ఉపేక్షించారు. ఆమె చేసినది నిరుపమానమైన త్యాగం! తన భర్త లక్ష్మణుడిని అన్నగారి సేవకు అంకితం చేసి, సుదీర్ఘమైన 14 వత్సరాలు ఆయన వియోగాన్ని భరించింది. తాను కూడా సీతాదేవిలాగా భర్తను అనుసరించి అడవులకు వెళ్ళవచ్చు.


View Comments(10)    Post a Comment    By - Satyanarayana Piska
 
      1  2  3  4  5         Page